కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై స్పందించారు. ఈ వ్యవహారం తమ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
బండి సంజయ్ మాట్లాడుతూ.. తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని తనతో చెప్పాడని తెలిపారు. అయితే, అతడిని కావాలనే క్రిమినల్‌లా చూపించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు.
‘తప్పు ఎవరు చేసినా చట్టం ముందు అందరూ సమానమే. తప్పు జరిగితే శిక్ష తప్పదు. ఎవరినీ సమర్థించే ప్రసక్తే లేదు’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు.
తన కుటుంబంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ‘సమాజమే నా కుటుంబం అనుకున్నాను. కానీ ఇప్పుడు నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
ఈ ఘటనల కారణంగా తన భార్య తీవ్ర మానసిక ఒత్తిడికి గురైందని, డిప్రెషన్‌లోకి వెళ్లిందని బండి సంజయ్ తెలిపారు.
తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించిన ఆయన.. ‘మీరు పెట్టిన నిప్పు మీకే అంటుకుంటుంది’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అలాగే కుట్రలు, కుతంత్రాలతో తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపిస్తూ, అవినీతి వ్యవస్థను ఎదుర్కొంటానని అన్నారు.
బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. భగీరథ్ కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.





