నేచురల్ స్టార్ నాని హీరోగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ది ప్యారడైజ్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. దసరా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
అయితే గత కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్, రీషూట్లపై సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. కొన్ని సన్నివేశాల విషయంలో నాని అసంతృప్తిగా ఉన్నారని, అందుకే దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో రీషూట్లు చేస్తున్నారని ప్రచారం జరిగింది.
అలాగే షూటింగ్ ఆలస్యం కావడంతో సినిమా వాయిదా పడుతోందని, రీషూట్ల కారణంగా బడ్జెట్ కూడా పెరిగిపోయిందనే వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఈ ప్రచారాలపై తాజాగా చిత్రబృందం అధికారికంగా స్పందించింది. సినిమా మొదటి రోజు నుంచే పూర్తి ప్రణాళికతో షూటింగ్ జరుగుతోందని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఒక్క సీన్ కూడా రీషూట్ చేయలేదని, భవిష్యత్తులో కూడా అలాంటి అవసరం లేదని మూవీ టీమ్ వెల్లడించింది.
ఇప్పటికే 100 రోజులకు పైగా షూటింగ్ పూర్తి అయిందని, మిగిలిన షెడ్యూల్ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతోందని తెలిపారు. సినిమా అనుకున్న ప్లాన్ ప్రకారమే ముందుకు సాగుతోందని, క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా పని చేస్తున్నామని పేర్కొన్నారు.
అనవసరమైన పుకార్లను నమ్మవద్దని, అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని మూవీ టీమ్ అభిమానులకు విజ్ఞప్తి చేసింది. తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.
అన్ని అంచనాలను అందుకునేలా సినిమాను రూపొందిస్తున్నామని, ది ప్యారడైజ్ ను 2026 ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేస్తామని చిత్రబృందం స్పష్టం చేసింది.
మొత్తానికి, ది ప్యారడైజ్ రీషూట్ వార్తలకు మూవీ టీమ్ అధికారిక ప్రకటనతో ఫుల్ స్టాప్ పడినట్లైంది.





