మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ షాక్ ఇచ్చింది. డ్రగ్స్ వినియోగం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఒక సమావేశంలో మాదకద్రవ్యాల వినియోగం జరిగిందని, ఆ సమయంలో రోహిత్ రెడ్డి అక్కడ ఉన్నారనే మీడియా కథనాలను పార్టీ తీవ్రంగా పరిగణించింది. ఈ అంశంపై 7 రోజుల్లోపు లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆయనను ఆదేశించింది.

ఇలాంటి అక్రమ కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉండటం పార్టీ విలువలకు, ప్రతిష్టకు విరుద్ధమని బీఆర్ఎస్ పేర్కొంది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నోటీసు జారీ చేసినట్లు ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ తెలిపారు.
తదుపరి నిర్ణయం తీసుకునే వరకు రోహిత్ రెడ్డి పార్టీ కార్యక్రమాలు, అధికారిక సమావేశాలకు దూరంగా ఉండాలని పార్టీ స్పష్టం చేసింది. గడువులోపు సరైన వివరణ ఇవ్వకపోతే, ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే పార్టీ రాజ్యాంగం ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఇక ప్రభుత్వం ఇప్పటికే ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసిన నేపథ్యంలో, సొంత పార్టీ కూడా చర్యలు ప్రారంభించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.





