పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ‘గబ్బర్ సింగ్’ తర్వాత వస్తున్న ఈ కాంబోపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చి 19న ఉగాది కానుకగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి భావోద్వేగంగా మాట్లాడారు. ‘ఈ వేడుకకు హాజరైన అభిమానులందరికీ, లైవ్‌లో చూస్తున్న ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. సినిమా నాకు చాలా ప్రత్యేకం. నాకు అన్నం పెట్టింది సినిమా, నేడు ప్రజలకు సేవ చేసే గుర్తింపును కూడా అదే ఇచ్చింది’ అని తెలిపారు.
సినిమా విజయంపై మాట్లాడిన ఆయన.. ‘సినిమా ఎంత కలెక్షన్లు సాధించింది అన్నది నాకు ముఖ్యం కాదు. సినిమా బాగుండాలి, ప్రేక్షకులకు నచ్చాలి అనేదే నా ఆశయం. తెలుగు, తమిళం అనే భేదం లేకుండా నేను భారతీయ సినిమాగా చూస్తాను. మన తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి చేరుకోవడం గర్వకారణం’ అని అన్నారు.
షూటింగ్ అనుభవాల గురించి మాట్లాడుతూ.. ‘ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. అయినా వాటిని దాటుకుని సినిమాను పూర్తి చేయడం సులభం కాదు. నా ఇతర బాధ్యతల మధ్య కూడా చాలా తక్కువ సమయంలో ఈ సినిమాను పూర్తి చేశాం. చిత్రబృందం అంతా ఎంతో కష్టపడ్డారు’ అని చెప్పారు.
అలాగే అభిమానులపై తన ప్రేమను వ్యక్తం చేస్తూ.. ‘మార్చి 19న ఈ సినిమాను మీ ముందుకు తీసుకురావడానికి నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. సినిమా మన జీవితంలో విడదీయరాని భాగం. మీ అందరికీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను. నాది మిమ్మల్ని ప్రేమించే గోత్రం.. సేవ చేసే నక్షత్రం’ అంటూ అభిమానులను ఉత్సాహపరిచారు.
చివరిగా ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖకు కృతజ్ఞతలు తెలుపుతూ, అందరికీ ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.





