బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా వార్ డ్రామా మరోసారి వార్తల్లో నిలిచింది. మొదట ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ పేరుతో ప్రచారంలోకి వచ్చిన ఈ చిత్రానికి ఇప్పుడు ‘మాతృభూమి’ (Maatrubhoomi) అనే కొత్త టైటిల్‌ను ఖరారు చేశారు. సల్మాన్ ఖాన్ స్వయంగా సోషల్ మీడియాలో కొత్త పోస్టర్‌ను షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించడంతో సినిమా హాట్ టాపిక్‌గా మారింది.
సల్మాన్ షేర్ చేసిన పోస్టర్‌లో ఆయన గాయాలతో, ఒంటినిండా రక్తంతో చాలా సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. శత్రువులు దాడి చేయకుండా ముళ్ల కంచె చుట్టిన ఒక స్తంభాన్ని అడ్డుకుంటున్న దృశ్యం పోస్టర్‌లో చూపించారు. ‘యుద్ధం శాంతిగా విశ్రమించనివ్వండి’ అనే క్యాప్షన్‌తో ఈ పోస్టర్‌ను ఆయన షేర్ చేశారు.

అయితే గతంలో ఈ సినిమాను ఏప్రిల్ 10న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ తాజాగా విడుదలైన పోస్టర్‌లో రిలీజ్ డేట్ కనిపించకపోవడం గమనార్హం. దీంతో అభిమానులు అయోమయంలో పడుతున్నారు. సినిమా విడుదల వాయిదా పడిందా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
May War Rest In Peace #Maatrubhumi@LakhiaApoorva @IChitrangda #HimeshReshammiya #CchintanShah @SKFilmsOfficial @SKF_Music @ShamiraahN pic.twitter.com/8eE4VgNhAK
— Salman Khan (@BeingSalmanKhan) March 16, 2026
టైటిల్ మార్పు వెనుక వివాదాలే కారణమని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. 2020లో జరిగిన గల్వాన్ లోయ ఘర్షణల ఆధారంగా దర్శకుడు అపూర్వ లఖియా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి చైనా ప్రభుత్వ మీడియా ‘గ్లోబల్ టైమ్స్’ గతంలోనే విమర్శలు చేసింది. ఈ చిత్రం నిజాలను వక్రీకరిస్తోందని, చైనాకు వ్యతిరేక భావజాలాన్ని పెంచుతోందని ఆరోపించింది.
ఈ నేపథ్యంలో విడుదల సమయంలో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ముందుగానే టైటిల్ మార్చినట్లు సమాచారం. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్ సరసన చిత్రంగద సింగ్ నటిస్తోంది. భారత సైనికులు దేశం కోసం చేసిన త్యాగాలు, ధైర్యసాహసాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు.
ఇక ‘మాతృభూమి’గా పేరు మార్చిన ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.





