మెగా అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఎట్టకేలకు వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర బృందం ఈరోజు (శనివారం) విడుదల చేసింది. ‘ఇది భగత్ గీత.. దమ్మున్నోడు దాటొచ్చు’ అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం యాక్షన్‌తో నిండిపోయి అభిమానులను ఆకట్టుకుంటోంది.
ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, వింటేజ్ లుక్ చూసిన అభిమానులకు ‘గబ్బర్ సింగ్’ రోజులు గుర్తుకొస్తున్నాయి. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల్లో పూనకాలు తెప్పిస్తోంది.
దర్శకుడు హరీష్ శంకర్ తన మార్క్ మాస్ ఎలివేషన్లతో ట్రైలర్‌ను మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. ఇంటెన్స్ యాక్షన్ సీన్లు, గుర్రపు స్వారీ, విలన్లను చితకబాదే సన్నివేశాలు ట్రైలర్‌కు హైలెట్‌గా నిలిచాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్‌ను మరింత పవర్‌ఫుల్‌గా మలిచింది.
మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. తమిళ నటుడు పార్తీబన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం U/A సర్టిఫికెట్ పొందింది.
ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెంచిన చిత్ర యూనిట్, రేపు (మార్చి 15, ఆదివారం) హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరుకానుండటంతో ఆయన ప్రసంగం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఉగాది కానుకగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల కానుంది. ట్రైలర్‌తోనే రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.





