HomePolitics Teluguరేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్..

రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్..

రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న వేసవిలో ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పేద ప్రజలు ప్రతినెలా రేషన్ దుకాణాల వద్ద గంటల తరబడి ఎదురుచూడకుండా కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర పౌరసరఫరాల శాఖ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.

మార్చి మొదటి వారం నుంచే ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో, రాబోయే రోజుల్లో వేడి మరింత తీవ్రతరం అవుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ముందుగానే మూడు నెలల రేషన్ బియ్యాన్ని అందించాలని కేంద్రం నిర్ణయించింది.

ఈ నిర్ణయంతో తెలంగాణలో సుమారు 3.20 కోట్ల మందికి ముందస్తుగా బియ్యం పంపిణీ జరగనుంది. కేంద్రం ఆదేశాల ప్రకారం మూడు నెలల కోటా కింద ఒకేసారి బియ్యం ఇవ్వాలి. ఒక వ్యక్తికి మొత్తం 18 కిలోల బియ్యం అందించాల్సి ఉంటుంది. ఒక కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటే వారికి 72 కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది.

అలాగే జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేటాయించిన ఆహార ధాన్యాలను జూన్ 2026 వరకు ముందుగానే సేకరించి, అర్హులైన లబ్ధిదారులకు వెంటనే పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది.

రాబోయే ఆహార ధాన్యాల సేకరణ సీజన్‌లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎదుర్కొనే లాజిస్టికల్ మరియు నిల్వ సమస్యలను దృష్టిలో పెట్టుకుని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో లబ్ధిదారులు వేసవిలో రేషన్ కోసం క్యూల్లో నిలబడాల్సిన అవసరం తగ్గనుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular