HomePolitics Teluguరాజ్యసభకు సింఘ్వీ, నరేందర్ రెడ్డి నామినేషన్!

రాజ్యసభకు సింఘ్వీ, నరేందర్ రెడ్డి నామినేషన్!

తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డికి వీరు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు.

శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో నామినేషన్లు దాఖలు చేయగా, ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మరికొద్ది సేపట్లో మరో సెట్ నామినేషన్ కూడా దాఖలు చేయనున్నట్లు సమాచారం.

రాష్ట్రం నుంచి ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాల భర్తీకి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో ఒక స్థానానికి ప్రస్తుత ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకే మరోసారి అవకాశం కల్పించగా, రెండో స్థానానికి సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం ఉదయం అధికారికంగా అభ్యర్థుల పేర్లు ప్రకటించింది.

నామినేషన్ అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన వేం నరేందర్ రెడ్డి, తనకు రాజ్యసభ అవకాశం కల్పించిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆశీర్వాదంతోనే ఈ అవకాశం దక్కిందని అన్నారు.

అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ, తనకు రెండోసారి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ హైకమాండ్‌కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు తాను రుణపడి ఉంటానని, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular