మొన్న ‘చికిరి’ ఆ తరవాత ‘మీసాల పిల్ల’, ఇప్పుడు ‘దేఖ్‌లేంగే సాలా’..
వరుసగా మూడు బ్లాక్ బస్టర్ పాటలు బయటకు వచ్చాయి. ఎక్కడ చూసినా ఈ పాటలే వినిపిస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే మూడూ మెగా సినిమాలే. రెహమాన్ అందించిన ‘పెద్ది’లోని తొలి పాట ‘చికిరి’ బ్లాక్ బస్టర్ అయ్యింది. వంద మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకొని రికార్డ్ సృష్టించిన గీతమిది. ఈ పాటతో ‘పెద్ది’ ఆల్బమ్ పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. నిజానికి రెహమాన్ పై తెలుగు ప్రేక్షకులకు ముఖ్యంగా మెగా అభిమానులకు పెద్దగా హోప్స్ లేవు. కానీ ఈ పాట బయటకు వచ్చి వాళ్లందర్నీ షాక్ కి గురి చేసింది. ఈనెలలోనే ‘పెద్ది’ నుంచి మరో పాట బయటకు రాబోతోంది. ఇది చికిరికి మించి ఉంటుందని ఇన్ సైడ్ వర్గాల టాక్.
‘మన శంకర వర ప్రసాద్ గారు’ నుంచి వచ్చిన తొలి పాట మీసాల పిల్ల కూడా మెగా అభిమానుల్ని ఉర్రూతలూగిస్తోంది. దాదాపు 80 మిలియన్ల మార్క్ చేరుకొంది ఈ పాట. రెండో పాట ‘శశిరేఖ’ బయటకు వచ్చినా మీసాల పిల్ల క్రేజ్ తగ్గలేదు. క్రిస్మస్ సందర్భంగా మరో పాట వస్తోంది. ఈసారి వెంకీ – చిరు కలసి స్టెప్పులేసిన పాట వదులుతున్నారు. కాబట్టి మరోసారి ఈ ఆల్బమ్ షేక్ చేయడం ఖాయం. రమణ గోగుల ఆలపించిన పాట బయటకు రావాల్సివుంది. అది మరింత క్రేజీగా ఉంటుందని సమాచారం.
ఉస్తాద్ నుంచి ‘దేఖ్‌లేంగే’ పాట బయటకు వచ్చింది. వస్తూ వస్తూనే ఫ్యాన్స్ ని ఊపేసింది ఈ పాట. పవన్ స్టెప్పులు, దేవి ట్యూన్, భాస్కరభట్ల రాసిన విధానం ఇవన్నీ అభిమానులకు నచ్చేశాయి. ఈ ఆల్బమ్ నుంచి ఇక మీదట వచ్చే ప్రతీ పాటా ఇదే జోష్‌లో ఉంటుందని చిత్రబృందం ధీమాగా చెబుతోంది. మొత్తానికి ఈ యేడాది చివర్లో మెగా బ్లాక్ బస్టర్ పాటలతో… ఫ్యాన్స్ పండగ చేసుకొంటున్నారు. డిసెంబరు 31 పబ్బుల్లో, పార్టీల్లో మార్మోగడానికి ఈ మాత్రం స్టఫ్ సరిపోతుంది.



