తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లపై (MLAs Disqualification petition) నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తున్న స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ (Gaddam Prasad)పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఈ విషయంలో మీరు నిర్ణయం తీసుకుంటారా? లేక మమ్మల్ని తీసుకోమంటారా?’’ అని ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది.
స్పీకర్‌కి ఒక వారంలోపే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిన సుప్రీం, అది కూడా చేయకపోతే కోర్టు ధిక్కారానికి లోనవుతారని, జైలుకి పంపే పరిస్థితి కూడా వస్తుందని స్పష్టం చేసింది. ‘‘రాబోయే నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో ముందే ఆలోచించండి’’ అంటూ ధర్మాసనం కఠిన వ్యాఖ్యలు చేసింది. అనంతరం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
సుప్రీంకోర్టు ఇచ్చిన మూడు నెలల గడువు పూర్తయ్యాక కూడా ఎమ్మెల్యేల అనర్హతపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తాజాగా కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఈ కేసుతో పాటు అనుబంధ రెండు పిటిషన్లను కూడా సీజేఐ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది. ఎమ్మెల్యేల అనర్హతపై రోజువారీ విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాల్సిందే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
స్పీకర్ తరఫున న్యాయవాదులు అభిషేక్ సింహ్వీ, ముఖుల్ రోహత్గీ హాజరై, నాలుగు వారాల్లోగా విచారణ పూర్తి చేసి నిర్ణయం తీసుకుంటామని కోర్టుకు హామీ ఇచ్చారు.





