HomeTeluguఇమ్మడి రవి వద్ద 50 లక్షల సబ్‌స్క్రైబర్ల డేటా.. సీపీ సజ్జనార్ సంచలన ప్రకటన

ఇమ్మడి రవి వద్ద 50 లక్షల సబ్‌స్క్రైబర్ల డేటా.. సీపీ సజ్జనార్ సంచలన ప్రకటన

పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అగ్ర సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్‌రాజు కలిసి సీపీ సజ్జనార్‌ను కలుసుకుని పైరసీ సమస్యపై చర్చించారు. అనంతరం సజ్జనార్ మీడియాతో మాట్లాడి పలు కీలక వివరాలు వెల్లడించారు.

సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం, ఐబొమ్మలో ఏకంగా 21 వేల సినిమాలు అందుబాటులో ఉండేవి. ఇమ్మడి రవి ఇప్పటి వరకూ పైరసీ ద్వారా సుమారు రూ.20 కోట్లు సంపాదించాడని వెల్లడించారు. అతని వద్ద నుండి రూ.3 కోట్లను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.

అదే సమయంలో, రవి వద్ద 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా ఉన్నట్లు తెలిపారు. “ఇంత భారీ డేటా ఒక వ్యక్తి వద్ద ఉండటం అత్యంత ప్రమాదకరం,” అని సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఒక వెబ్‌సైట్ బ్లాక్ చేసిన వెంటనే మరో సైట్ తెరుస్తున్న పెద్ద నెట్‌వర్క్‌ను రవి నడిపేవాడని పోలీసులు కనుగొన్నారు. వందకిపైగా వెబ్‌సైట్లు కొనుగోలు చేసి, 65 మిర్రర్ సైట్లు ఆపరేట్ చేసినట్లు తెలిపారు. యూకే సర్వర్లు, వివిధ VPNలతో లొకేషన్లు మార్చుతూ పైరసీ సినిమాలను అప్‌లోడ్ చేస్తారని చెప్పారు.

కూకట్‌పల్లిలోని రవి ఇంటిపై దాడి చేసి వందలాది హార్డ్‌డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 1972లో వచ్చిన ‘గాడ్‌ఫాదర్’ నుంచి తాజాగా విడుదలైన ‘ఒజీ’ వరకు మొత్తం 21 వేల సినిమాలు ఉన్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసిన పరికరాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.

ఈ భారీ పైరసీ రాకెట్‌ను పూర్తిగా ఛేదించేందుకు జాతీయ సెక్యూరిటీ సంస్థల సహాయం కోరినట్లు సజ్జనార్ ప్రకటించారు. ఇప్పటికే రవిపై ఐటీ యాక్ట్, కాపీరైట్ యాక్ట్ కింద ఏడు కేసులతో పాటు మరిన్ని నాలుగు కేసులు కూడా నమోదు చేసినట్లు తెలిపారు.

ఇమ్మడి రవిని అరెస్ట్ చేసినందుకు పోలీసులకు విశేషమైన ధన్యవాదాలు తెలుపుతూ నిర్మాతలు, దర్శకులు, నటులు ఆనందం వ్యక్తం చేశారు. పైరసీ కారణంగా సినీ పరిశ్రమకు భారీగా జరిగిన నష్టాన్ని తగ్గించడంలో ఇది కీలక అడుగని పేర్కొన్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular