చలనచిత్ర రంగంలో 50 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్, నందమూరి బాలకృష్ణలకు ఈ ఏడాది ప్రత్యేక గౌరవం దక్కనుంది. గోవాలో జరిగే 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI 2025)లో ఈ ఇద్దరు లెజెండరీ నటులను ప్రత్యేకంగా సన్మానించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కేంద్ర సమాచార-ప్రసారశాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
మురుగన్ మాట్లాడుతూ..
“సినీ రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసిన రజనీకాంత్, బాలకృష్ణలను IFFI ముగింపు వేడుకల్లో ఘనంగా సత్కరించనున్నాం. భారతీయ సినిమాకు వీరిద్దరూ అందించిన సేవలు అసాధారణం. దశాబ్దాలుగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే పాత్రలు పోషించారు,”
అని తెలిపారు.
IFFI 2025 నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనుంది. భారతీయ సినిమా ప్రపంచం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ వేడుకలో ఇలాంటి ఘన సన్మానాలు చాలా అరుదుగా జరుగుతాయి.
రజనీకాంత్ – 50 ఏళ్ల సినీ ప్రయాణం
1975లో ‘అపూర్వ రాగంగళ్’తో వెండి తెరకు పరిచయమైన రజనీకాంత్, తన ప్రత్యేక స్టైల్‌తో కోట్లాది అభిమానులను సంపాదించారు. తమిళ సినీ ఇండస్ట్రీ మాత్రమే కాదు, భారతీయ సినిమా చరిత్రలోనే ఒక పెద్ద ఐకాన్‌గా నిలిచారు.
బాలకృష్ణ – నటుడు, నాయకుడు, సేవామూర్తి
బాల నటుడిగా కెరీర్ ప్రారంభించిన బాలకృష్ణ, తన నటన, యాక్షన్ స్టైల్, డైలాగ్ డెలివరీతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. నటుడిగానే కాకుండా, రాజకీయ నాయకుడిగా, సామాజిక సేవకుడిగా కూడా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ‘అఖండ 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
ఈ ఇద్దరు మేటి నటులను ఒకేసారి IFFI వేదికపై సన్మానించడం భారత సినీ చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టంగా నిలవనుందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.





