ప్రముఖ నటి కీర్తి సురేష్ (Keerthy Suresh)కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్యసమితికి చెందిన యూనిసెఫ్ (UNICEF – United Nations International Children’s Emergency Fund) ఇండియా విభాగం ఆమెను సెలబ్రిటీ అడ్వకేట్‌గా నియమించింది. పిల్లల మానసిక ఆరోగ్యం, భద్రత, హక్కుల పరిరక్షణ, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ఆమె కీలక పాత్ర పోషించనుందని యూనిసెఫ్ ఇండియా ప్రతినిధి సింథియా మెక్‌కాఫ్రీ వెల్లడించారు.
ఈ సందర్భంగా స్పందించిన కీర్తి సురేష్, యూనిసెఫ్ వంటి అంతర్జాతీయ సంస్థతో పనిచేసే అవకాశం దొరకడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. “ఇది నాకు దక్కిన అత్యంత గౌరవాల్లో ఒకటి. పిల్లల శ్రేయస్సు, వారి భవిష్యత్తు మనందరి బాధ్యత. పిల్లల పెంపకం, సంరక్షణ, మానసిక ఆరోగ్యం, నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకు పునాది వేస్తున్న ఈ కార్యక్రమంలో భాగం కావడం నాకు ఎంతో గర్వంగా ఉంది” అని తెలిపింది.
సినీ రంగంలో తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్, ఇప్పుడు సామాజిక సేవా రంగంలో కూడా అడుగుపెడుతుండటంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల హక్కుల కోసం పనిచేయడానికి ఆమెను ఎంపిక చేసినందుకు యూనిసెఫ్ ఇండియా కూడా సంతోషాన్ని ప్రకటించింది. కీర్తి పాల్గొనే అవగాహన కార్యక్రమాలు, క్యాంపెయిన్లు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.





