ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో 3 లక్షల ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందజేసి, స్వయంగా గృహప్రవేశాలు చేశారు. హేమలత, షేక్ ముంతాజ్ బేగం కుటుంబాలకు తాళాలు అందజేసి, వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజా వేదిక వద్ద లబ్ధిదారులతో సమావేశమై మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, “త్వరలో మిగిలిన ఇళ్లను కూడా పూర్తి చేసి అందిస్తాం” అని హామీ ఇచ్చారు. “ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదు, భవిష్యత్తుకు భద్రత” అని ఆయన పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..
పక్కా ఇళ్లు ప్రారంభించింది ఎన్టీఆర్, తెలుగుదేశం.
— Telugu Desam Party (@JaiTDP) November 12, 2025
కూడు, గూడు, గుడ్డ నినాదంతో పుట్టిన పార్టీ టీడీపీ. మీ అందరికీ హామీ ఇస్తున్నా… ప్రతి ఒక్కరికీ సొంతిళ్లు ఇచ్చే బాధ్యత నాది. #3LakhHousesForPoorInAP#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/tTLswqdnNy
“పేదలకు తొలిసారిగా పక్కా ఇళ్లు నిర్మించిన వ్యక్తి మహానేత ఎన్.టి. రామారావు గారు. కూడు, గూడు, గుడ్డ నినాదంతో పుట్టిన పార్టీ టీడీపీ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తోంది” అని అన్నారు.
తన జీవితంలో ఇదే అత్యంత ఆనందకరమైన రోజు అని పేర్కొన్న చంద్రబాబు, ఒక్కరోజే 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలు చేయడం చారిత్రాత్మకమని తెలిపారు.
అలాగే నిన్న కనిగిరిలో 97 పరిశ్రమలకు పునాది వేసినట్లు గుర్తుచేసి, “ప్రతి కుటుంబంలో కనీసం ఒక పారిశ్రామిక వేత్త తయారుకావాలి” అని పిలుపునిచ్చారు.
వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించిన ఆయన..
“గత ప్రభుత్వ హయాంలో నివాసానికి పనికిరాని ప్రదేశాల్లో స్థలాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. పేదల కోసం ఇచ్చే ఇసుకను కూడా పందికొక్కుల్లా దోచుకున్నారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందజేస్తోంది” అని విమర్శించారు.
ముస్లింలు సహా అందరికీ సమానంగా ఇళ్లను కేటాయిస్తామని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు, వచ్చే ఏడాది ఉగాది నాటికి 5.90 లక్షల గృహప్రవేశాలు చేయిస్తామని ప్రకటించారు.
“2029 నాటికి రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సొంతిల్లు ఇవ్వడమే మా లక్ష్యం” అని ఆయన హామీ ఇచ్చారు.





