HomeMovie News Teluguప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత

ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత

భారతీయ సినీ పరిశ్రమలో విలక్షణ విలన్‌గా గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ (74) కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన, ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ప్రదీప్ రావత్ తన నట జీవితాన్ని బి.ఆర్. చోప్రా రూపొందించిన ప్రముఖ టెలివిజన్ సీరియల్ ‘మహాభారత్’ లో అశ్వత్థామ పాత్రతో ప్రారంభించారు. ఆ పాత్రతో మంచి గుర్తింపు సంపాదించిన ఆయన, అనంతరం బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో విలన్‌గా తనదైన ముద్ర వేశారు.

హిందీలో ‘లగాన్’, ‘సర్ఫరోష్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రావత్.. తెలుగులో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘సై’ చిత్రంలో ‘భిక్షు యాదవ్’ పాత్రతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. అనంతరం ‘గజినీ’, ‘భద్ర’, ‘స్టాలిన్’, ‘ఛత్రపతి’ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో తన విలక్షణ నటనతో మెప్పించారు.

చివరిసారిగా ఆయన నటించిన ‘గాయపడ్డ సింహం’ చిత్రం ఈ ఏడాది మే 1న విడుదలైంది. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

వ్యక్తిగత జీవితం..

1952 జనవరి 21న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో రిటైర్డ్ మేజర్ మంగళ్ సింగ్ రావత్ దంపతులకు ప్రదీప్ రామ్‌సింగ్ రావత్ జన్మించారు. సిమ్లాలోని మిలిటరీ పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేసిన ఆయన, జబల్‌పూర్ ప్రభుత్వ సైన్స్ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించారు.

కొంతకాలం యూకో బ్యాంక్‌లో ఉద్యోగిగా పనిచేసిన అనంతరం నటనపై ఆసక్తితో రంగప్రవేశం చేశారు. ‘మహాభారత్’ సీరియల్‌లో అశ్వత్థామ పాత్ర ఆయన జీవితాన్ని మలుపుతిప్పింది. ఆ అవకాశానికి ప్రముఖ నటి స్మితా పాటిల్ సిఫారసు కూడా కారణమైందని పలు సందర్భాల్లో ఆయన పేర్కొన్నారు.

టెలివిజన్‌తో పాటు దేశంలోని పలు నగరాల్లో నాటకాల్లోనూ ప్రదీప్ రావత్ చురుకుగా పాల్గొన్నారు. రాజ్ బబ్బర్, అనుపమ్ ఖేర్, అలోక్ నాథ్ వంటి ప్రముఖ నటులతో కలిసి రంగస్థలంపై నటించే అవకాశం దక్కడం తన అదృష్టమని ఆయన పలుమార్లు వెల్లడించారు.

విలన్ పాత్రలకు కొత్త గుర్తింపు తీసుకొచ్చిన ప్రదీప్ రావత్ మరణం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటుగా నిలిచిపోతుంది. ఆయన నటించిన పాత్రలు ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోతాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular