దేశవ్యాప్తంగా ఆధార్ కార్డుదారులకు సంబంధించి ముఖ్యమైన మార్పులు రానున్నాయి. UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) నవంబర్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్‌ను అమలు చేయబోతోంది. ఈ మార్పుల వల్ల ఆధార్ వివరాలను ఇంటి నుంచే అప్‌డేట్ చేయడం చాలా సులభం కానుంది. ఇకపై ఆధార్ సెంటర్ల వద్ద క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేదు.
పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ వంటి వివరాలను ఆన్‌లైన్‌లోనే అప్‌డేట్ చేసుకోవచ్చు. అదనంగా మరికొన్ని నిబంధనలు కూడా మారబోతున్నాయి.
గవర్నమెంట్ ఐడీతో ఆధార్ అప్‌డేట్
ఇప్పటివరకు ఆధార్‌లో మార్పులు చేయాలంటే సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉండేది. కానీ ఇప్పుడు పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, జనన ధృవీకరణ పత్రం వంటి ప్రభుత్వ గుర్తింపు పత్రాలతోనే ఆన్‌లైన్‌లో మార్పులు చేసుకోవచ్చు. అప్‌డేట్ ఫీజులు కూడా కొత్తగా నిర్ణయించారు:
పేరు, చిరునామా లేదా మొబైల్ నంబర్ అప్‌డేట్‌కి – ₹75
వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ లేదా ఫోటో అప్‌డేట్‌కి – ₹125
5-7, 15-17 సంవత్సరాల పిల్లలకు బయోమెట్రిక్ అప్‌డేట్ ఉచితం
ఆధార్ రీప్రింట్‌కి – ₹40
పాన్-ఆధార్ లింక్ తప్పనిసరి
కొత్త నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ తమ పాన్ కార్డును ఆధార్‌తో తప్పనిసరిగా లింక్ చేయాలి. ఈ ప్రక్రియను డిసెంబర్ 31, 2025 నాటికి పూర్తి చేయాలి. లింక్ చేయని పక్షంలో జనవరి 1, 2026 నుండి పాన్ కార్డ్ చెల్లుబాటు కాని దానిగా పరిగణించబడుతుంది.
ఈజీ కేవైసీ ప్రాసెస్
నవంబర్ 1 నుంచి కేవైసీ (KYC) ప్రక్రియ మరింత సులభం కానుంది. బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు ఇప్పుడు ఆధార్ నంబర్‌తోనే కేవైసీ పూర్తి చేయగలవు. ఓటీపీ ధృవీకరణ, వీడియో కన్ఫర్మేషన్ లేదా ఫేస్ టు ఫేస్ వెరిఫికేషన్ ద్వారా కేవైసీ చేయవచ్చు.



