టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంటేనే ఒక బ్రాండ్. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించి చరిత్ర సృష్టించిన ధోని, అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా అతని క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.
దీనికి నిదర్శనమే ఐపీఎల్ టోర్నమెంట్. ప్రతి సీజన్‌లో ధోనిని మైదానంలో చూడాలనే ఫ్యాన్స్ ఆశపడుతుంటారు. తాను రిటైర్మెంట్ తీసుకుంటానని పలుమార్లు చెప్పినా, చెన్నై యాజమాన్యం అభిమానుల కోరిక మేరకు అతన్ని తిరిగి ఆడిస్తోంది.

తాజాగా ధోని తమిళనాడులోని మధురైలో వెలమ్మల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ వేడుకలో ధోని పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా, స్టేడియం శిలాఫలకం మీద ధోని పేరును “Captain – ICC Triple Trophy Winner” అని లిఖించడం అభిమానుల హృదయాలను తాకింది.
సాధారణంగా ‘మిస్టర్ కూల్’గా పిలిచే ధోనికి ఈ కొత్త బిరుదు పెద్ద గౌరవంగా మారింది. ఫ్యాన్స్ ఇప్పుడు “మిస్టర్ కూల్ కాదు.. ఐసీసీ ట్రిపుల్ ట్రోఫీ విన్నర్ ధోని” అంటూ సోషల్ మీడియాలో సంబరాలు చేస్తున్నారు.
గమనించదగిన విషయం ఏమిటంటే, ధోని కెప్టెన్సీలో టీమిండియా టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలను గెలుచుకుంది – ఈ ఘనత ఏకైక భారత కెప్టెన్‌కే దక్కింది.





