జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగియగా, పలు సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ పార్టీకి బంపర్ విక్టరీ సంకేతాలు వెలువడ్డాయి. బీఆర్ఎస్, బీజేపీలు తమ గెలుపుపై ధీమాగా ఉన్నప్పటికీ, ఎక్కువ శాతం సర్వేలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి.
వివిధ సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. చాణక్య స్ట్రాటజీస్ సర్వేలో కాంగ్రెస్ 46%, బీఆర్ఎస్ 43%, బీజేపీ 6% ఓట్లు సాధిస్తుందని అంచనా వేసింది. పీపుల్స్ పల్స్ సర్వేలో కాంగ్రెస్ 48%, బీఆర్ఎస్ 41%, బీజేపీ 6%గా తేలింది. నాగన్న సర్వే ప్రకారం కాంగ్రెస్ 47%, బీఆర్ఎస్ 41%, బీజేపీ 8% ఓట్లు సాధించే అవకాశం ఉందని తెలిపింది. ఆపరేషన్ చాణక్య సర్వే ప్రకారం కాంగ్రెస్ 8 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తుందని తేల్చింది. జన్‌మైన్ సర్వే ప్రకారం కాంగ్రెస్ 42.5%, బీఆర్ఎస్ 41.5%, బీజేపీ 11.5% ఓట్లు పొందే అవకాశం ఉందని వెల్లడించింది.
సర్వేలు అన్నీ దాదాపు ఒకే దిశగా చూపుతున్నాయి.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉందని స్పష్టం చేశాయి.
ఈ ఉపఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. మూడు ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీఆర్ఎస్‌కు ఇది ప్రతిష్ఠ పరమైన పోరు కాగా, కాంగ్రెస్‌కు ఇది తన పాలనపై ప్రజల తీర్పుగా భావిస్తున్నారు. బీజేపీ కూడా ఈ బైపోల్‌ను వ్యూహాత్మకంగా చూస్తోంది.
ఎన్నికల వేడి తగ్గినా, ఆసక్తి మాత్రం పెరుగుతోంది. జూబ్లీహిల్స్ ప్రజల ఓటు ఏ దిశగా వెళ్ళిందో తెలుసుకోవడానికి అందరి చూపు నవంబర్ 14న జరగబోయే ఓట్ల లెక్కింపుపై నిలిచింది.





