HomePolitics Teluguఅందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

తెలంగాణ ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Andesri) అకాల మరణం యావత్‌ తెలంగాణను విషాదంలో ముంచెత్తింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన అంత్యక్రియలు ఈరోజు ఘట్కేసర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలోని హెచ్ఎండీఏ స్థలంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించబడ్డాయి.

అంత్యక్రియల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హెచ్, సాహితీ ప్రముఖులు, అందెశ్రీ అభిమానులు పాల్గొన్నారు.

అంత్యక్రియల అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి “అందెశ్రీని కోల్పోవడం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. తెలంగాణ కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైనది.” అలాగే ఆయన రచనలను స్మరించుకుంటూ పలు ముఖ్య నిర్ణయాలను ప్రకటించారు.

జయజయహే తెలంగాణ గీతాన్ని పాఠ్య పుస్తకాలలో చేర్చుతామని తెలిపారు. అందెశ్రీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. త్వరలో ‘అందెశ్రీ స్మృతివనం’ (Andesri Memorial Park) ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందెశ్రీ రచనలను ప్రజల్లో నిలుపుకోవడమే లక్ష్యమని రేవంత్ అన్నారు.

“అందెశ్రీ రాసిన ‘నిప్పుల వాగు’ పుస్తకం తెలంగాణ సమస్యలపై పోరాడేవారికి గైడ్‌లా ఉపయోగపడుతుంది. దానిని 20 వేల ప్రతులుగా ముద్రించి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి లైబ్రరీలో అందుబాటులో ఉంచుతాం” అని వెల్లడించారు.

అందెశ్రీ సేవలను గౌరవిస్తూ ఆయనకు పద్మశ్రీ పురస్కారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

“అందెశ్రీ తెలంగాణ సాంస్కృతిక గర్వం. ఆయనకు పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తాం. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా దీనికి సహకరించాలి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఈ ప్రయత్నం విజయవంతం చేయాలి” అని సీఎం పిలుపునిచ్చారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular