మొంథా తుఫాన్ బీభత్సం ఇంకా పూర్తిగా తగ్గకముందే తెలుగు రాష్ట్రాలకు మరోసారి వాతావరణ హెచ్చరిక జారీ అయింది. వాతావరణ శాఖ తాజా అంచనా ప్రకారం, నవంబర్ 4న బంగాళాఖాతంలో మరో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అండమాన్ సమీప ప్రాంతాల్లో ఈ అల్పపీడనం రూపుదిద్దుకునే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు.
ఈ వ్యవస్థ బలపడితే మరోసారి భారీ వర్షాలు, గాలివానలు తెలుగు రాష్ట్రాలను మళ్లీ వణికించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. రెండు రోజుల క్రితం దూసుకొచ్చిన మొంథా తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇప్పటికే భారీ నష్టం సంభవించింది. పలు జిల్లాల్లో వర్షాలు, గాలివానలు తీవ్రంగా ప్రభావం చూపాయి.
ఇప్పుడే సాధారణ స్థితికి వస్తున్న సమయంలో మరో కొత్త అల్పపీడనం వస్తోందన్న సమాచారం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. వాతావరణ నిపుణుల ప్రకారం, ఈసారి ఏర్పడే అల్పపీడనం కూడా తుఫాన్‌గా మారే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో వరుసగా తుఫాన్లు దాడి చేయడం రైతులు, మత్స్యకారులు, తీరప్రాంత ప్రజల్లో భయాందోళనలకు కారణమవుతోంది. నిపుణులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.





