HomeSports Teluguమహిళల వరల్డ్ కప్‌లో అదరగొట్టిన టీమ్ ఇండియా.. ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక విజయం!

మహిళల వరల్డ్ కప్‌లో అదరగొట్టిన టీమ్ ఇండియా.. ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక విజయం!

భారత్ మహిళల జట్టు అద్భుతం చేసింది. సెమీఫైనల్‌లో బలమైన ఆస్ట్రేలియా జట్టును చిత్తు చేసి, వరల్డ్ కప్ ఫైనల్‌కి అడుగు దూరంలో నిలిచింది. ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ ఛేదించని భారీ లక్ష్యాన్ని సాధించి, క్రికెట్ ప్రేమికులందరినీ ఆశ్చర్యపరిచింది.

మహిళల క్రికెట్ అంత రసవత్తరంగా ఉండదనుకున్నవారు ఈ మ్యాచ్ చూశారంటే, వారి అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. ఆసీస్‌తో భారత్ మధ్య జరిగిన ఈ పోరాటం ప్రేక్షకులని కుర్చీల అంచులపై కూర్చోబెట్టేలా సాగింది. 339 పరుగుల టార్గెట్ ముందు భారత జట్టు అవకాశాలు లేవనుకున్నారు. కానీ హర్మన్‌ప్రీత్ సేన అదరగొట్టింది. కంగారూలకు కలలో కూడా ఊహించని షాక్ ఇచ్చింది.

జెమీమా రోడ్రిగ్స్ అద్భుత ఇన్నింగ్స్

హర్మన్‌ప్రీత్ కౌర్‌ కెప్టెన్సీలో భారత జట్టు చరిత్ర సృష్టించింది. జెమీమా రోడ్రిగ్స్ అజేయంగా 127 పరుగులు (134 బంతుల్లో 14 బౌండరీలు) చేసి మ్యాచ్‌ను ఒంటరిగా గెలిపించింది. ఆమెతో పాటు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (89; 88 బంతుల్లో 10×4, 2×6) కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఈ జంట ఒత్తిడిని తట్టుకుని భారత జట్టును 48.3 ఓవర్లలో 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేలాగ చేసింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఫోబ్ లిచ్‌ఫీల్డ్‌ (119), ఎలిస్ పెర్రీ (77), ఆష్లీ గార్డ్నర్‌ (63) బ్యాటింగ్ సాయంతో 338 పరుగులు చేసింది. కానీ భారత్ జెమీమా, హర్మన్ జోడీ అద్భుత పోరాటంతో ఆ టార్గెట్‌ను ఛేదించింది.

జెమీమాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఆదివారం జరిగే ఫైనల్‌లో భారత మహిళల జట్టు సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది. ఈసారి ఎవరైనా గెలిచినా కొత్త ఛాంపియన్ చూసే అవకాశం అభిమానులకు లభించనుంది, ఎందుకంటే ఇరుజట్లు ఇప్పటి వరకు కప్ గెలవలేదు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular