టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) మరోసారి సినిమా రంగంలో కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. ఇటీవల ఆమె నిర్మాతగా వ్యవహరించిన ‘శుభం’ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమాలో సమంత కీలక పాత్రలో కనిపించడం, అలాగే ఆమె నిర్మాణ సంస్థకు మొదటి విజయంగా నిలవడం విశేషం.
ఇప్పుడు అదే బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ నిర్మాణంలో ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram) అనే కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్‌పై అభిమానులు ఎప్పటి నుంచో అప్డేట్ కోసం ఎదురుచూస్తుండగా, సమంత స్వయంగా ఈ సంతోషకరమైన వార్తను సోషల్ మీడియాలో పంచుకుంది.

“ప్రేమ, ఆశీర్వాదాలతో ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని మంచి ముహూర్తంలో ప్రారంభించాము. మేము సృష్టిస్తున్నది మీతో పంచుకోవడానికి వేచి ఉండలేము. ఈ ప్రత్యేకమైన ప్రయాణానికి మీ ప్రేమ, మద్దతు అవసరం” అని సమంత తన పోస్ట్‌లో పేర్కొంది.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు మరియు సినీ ప్రముఖులు సమంతకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

‘మా ఇంటి బంగారం’ సినిమాలో సమంత, దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి, మంజుషా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సమంత, రాజ్ నిడుమోరు (Raj Nidumoru), హిమాంక్ దువ్వూరు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
‘ఓ బేబీ’ బ్లాక్‌బస్టర్ తర్వాత సమంత, దర్శకురాలు నందినీ రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం పట్ల భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంగీతం సంతోష్ నారాయణన్ అందిస్తున్నారు.





