పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ మరియు పరిసర తీర ప్రాంతాల్లో పరిశ్రమల కాలుష్యం వల్ల మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఉప్పాడలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.
వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ మృతి చెందిన 18 మంది మత్స్యకారుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.90 లక్షల బీమా అందజేశామని తెలిపారు. మత్స్యకారులు వివరించిన సమస్యలను పూర్తిగా అర్ధం చేసుకున్నానని, వాటి పరిష్కారం కోసం 100 రోజుల్లో పూర్తి స్థాయి ప్రణాళికతో ముందుకు వస్తామని హామీ ఇచ్చారు.

పారిశ్రామిక కాలుష్యంపై పొల్యూషన్ ఆడిట్ నిర్వహించాలని పీసీబీ అధికారులకు పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. అదేవిధంగా, 3-4 రోజుల్లో తీరప్రాంతాల్లో స్వయంగా పర్యటించి కాలుష్య స్థితిని పరిశీలిస్తానని తెలిపారు.
మత్స్యకారుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ఇతర మంత్రిత్వ శాఖలతో చర్చించి సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

“అభివృద్ధితోపాటు పర్యావరణం కూడా అంతే ముఖ్యమైనది. దివిస్, అరబిందో కంపెనీల నుంచి వస్తున్న కాలుష్యం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 7,193 కుటుంబాలు పూర్తిగా వేట మీద ఆధారపడి జీవిస్తున్నాయి. ఈ కాలుష్య సమస్యకు పరిష్కారం చూపలేకపోతే… రాజకీయాలు వదిలేస్తా” అని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.





