మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ తాజాగా చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం పళ్లిచట్టంబి ప్రమోషన్స్ సందర్భంగా ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్గా నటిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో నిర్వహించగా, టొవినో థామస్ తన వర్కింగ్ స్టైల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఒకేసారి ఒక సినిమా మాత్రమే చేయాలనే విధానాన్ని పాటిస్తాను. ఒక ప్రాజెక్ట్ కోసం ఏడాదికి మించి సమయం కేటాయించడం కూడా నాకు ఇష్టం లేదు. ఒక సినిమా నుంచి మరో సినిమా షెడ్యూల్‌కు మారుతూ పనిచేయడం నాకు సౌకర్యంగా ఉండదు అని తెలిపారు.
ఇదే కారణంగా ప్రస్తుతం తెలుగు సినిమాలు చేయడం లేదని స్పష్టం చేశారు. తాను ప్రధానంగా మలయాళ చిత్రాలపైనే దృష్టి పెడుతున్నానని వెల్లడించారు.
ఈ వ్యాఖ్యలతో, టొవినో థామస్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు క్లారిటీ వచ్చింది. దీంతో ఈ ప్రాజెక్ట్‌లో ఆయన స్థానంలో ఎవరు వస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.





