మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన భారీ చిత్రం పెద్ది బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించగా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. జూన్ 4న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి స్పందనతో థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలైన తొలి వారం రోజుల్లోనే రూ.345 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
తాజాగా మేకర్స్ విడుదల చేసిన మరో పోస్టర్ ప్రకారం.. 2026లో సౌత్ ఇండియాలో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా ‘పెద్ది’ నెంబర్‌వన్ స్థానంలో నిలిచింది. ఈ ఘనతతో రామ్ చరణ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రెండో వారంలోనూ సినిమా బలమైన ప్రదర్శన కొనసాగిస్తుండటంతో, ఫుల్ రన్ ముగిసే సమయానికి మరిన్ని రికార్డులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ మార్కెట్‌లో ‘పెద్ది’కి మంచి ఆదరణ లభిస్తోంది.
ఇక రామ్ చరణ్ కెరీర్ పరంగా చూస్తే.. సోలో హీరోగా విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా పెద్ది నిలిచినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ చిత్రం చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ వసూళ్లతో పాటు ప్రేక్షకుల ఆదరణను కూడా సొంతం చేసుకుంటున్న పెద్ది ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తన విజయయాత్రను కొనసాగిస్తోంది.






