నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటోంది. ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తున్న రష్మికకు తాజాగా మరో అరుదైన అవకాశం దక్కినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. భారతీయ సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయిన లెజెండరీ గాయని, భారతరత్న ఎం.ఎస్. సుబ్బలక్ష్మి జీవితకథ ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో టైటిల్ పాత్ర కోసం రష్మిక మందన్న పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ పాత్ర కోసం ఇటీవల రష్మికతో ప్రత్యేక లుక్ టెస్ట్ కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. సంప్రదాయ దుస్తుల్లో ఆమె లుక్ చిత్రబృందాన్ని ఆకట్టుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ పాత్ర కోసం గతంలో సాయి పల్లవి, రుక్మిణి వసంత పేర్లు కూడా బలంగా వినిపించాయి. ముఖ్యంగా సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకుంటున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే తాజా పరిణామాల ప్రకారం.. మేకర్స్ రష్మిక వైపు మొగ్గు చూపుతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఎం.ఎస్. సుబ్బలక్ష్మి పాత్రలో చివరకు ఎవరు నటిస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. కాగా.. ఈ ప్రతిష్టాత్మక బయోపిక్కు జెర్సీ ఫేమ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన వెలువడితే ఈ ప్రాజెక్ట్‌పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.





