గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే భారీ వసూళ్లు సాధిస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. అయితే.. ఈ సినిమా తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే సినిమాలోని కొన్ని సన్నివేశాలపై చర్చ జరుగుతుండగా, ఇప్పుడు గిరిజనులను కించపరిచేలా కొన్ని డైలాగులు, సన్నివేశాలు ఉన్నాయంటూ ఆదివాసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
విజయనగరం జిల్లాకు చెందిన పలు గిరిజన సంఘాల ప్రతినిధులు జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సినిమాలో గిరిజనుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కొన్ని సంభాషణలు ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. సినిమాలో పలుచోట్ల తమ సమాజాన్ని అవమానించేలా పదజాలం ఉపయోగించారని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే ఈ అంశాన్ని సీరియస్గా పరిగణించి సంబంధిత అధికార సంస్థలు స్పందించాలని కోరుతున్నాయి.
మరోవైపు, ఇలాంటి అభ్యంతరాలు ఉన్నప్పటికీ సినిమా విడుదలకు అనుమతి ఎలా లభించిందనే ప్రశ్నలను కూడా కొందరు సంఘాల నాయకులు లేవనెత్తుతున్నారు. అయితే ఈ వివాదంపై ఇప్పటివరకు చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు. దీంతో ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతున్న పెద్ది సినిమాకు సంబంధించిన ఈ తాజా వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది.





