HomePolitics Teluguబండి భగీరథ్ కోసం పోలీసుల గాలింపు..

బండి భగీరథ్ కోసం పోలీసుల గాలింపు..

పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ కోసం తెలంగాణ పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. ఈ కేసును అత్యంత సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వెతుకులాట కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్, కరీంనగర్, ఢిల్లీ ప్రాంతాల్లో ప్రత్యేక టీమ్స్ గాలింపు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. గాలింపులో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసంలో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అలాగే భగీరథ్ మేనమామ వంశీకృష్ణ నివాసంతో పాటు మరికొన్ని బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేసినట్లు సమాచారం.

భగీరథ్ ప్రస్తుతం ఢిల్లీలో కొందరు బీజేపీ నేతల వద్ద ఉన్నారనే సమాచారంతో పోలీసుల ప్రత్యేక బృందం అక్కడికి కూడా వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా, ఈ కేసు నమోదైన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

మరోవైపు, భగీరథ్ ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈరోజే ఆయనను మేడ్చల్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించే అవకాశం ఉందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఒకవైపు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడం, మరోవైపు భగీరథ్ స్వయంగా లొంగిపోవచ్చనే ప్రచారం జరగడం ప్రస్తుతం ఈ వ్యవహారంలో ఉత్కంఠను పెంచుతోంది. 17 ఏళ్ల మైనర్ బాలిక కుటుంబ సభ్యులు మే 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.

మొదట జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. అనంతరం పోక్సో చట్టం కింద నాన్-బెయిలబుల్ సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయగా, భగీరథ్ మొబైల్ ఫోన్ గత కొన్ని రోజులుగా స్విచ్ఛాఫ్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular