గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన భారీ చిత్రం పెద్ది జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. తాజాగా బుచ్చిబాబు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బుచ్చిబాబు మాట్లాడుతూ.. ‘మా ఊర్లో పెద్ది రాజు అనే వ్యక్తి ఉండేవాడు. కూలీ పనులు చేసేవాడు కానీ క్రికెట్, వాలీబాల్ అద్భుతంగా ఆడేవాడు. మేము డబ్బులు ఇచ్చి మరీ మ్యాచ్‌లు ఆడించుకునే వాళ్లం. అతను ఒక్కడే మ్యాచ్ గెలిపించే స్థాయిలో ఆడేవాడు. అక్కడి నుంచే పెద్ది పాత్రకు ఆలోచన వచ్చింది’ అని తెలిపారు. అలాగే.. ‘ఇలాంటి కథ మళ్లీ రాయడం నాకు కష్టమే. ఈ పాత్ర కోసం రామ్ చరణ్ చాలా కష్టపడ్డారు. ఎక్కడా డూప్ కూడా ఉపయోగించలేదు’ అంటూ చరణ్ డెడికేషన్‌ను ప్రశంసించారు.
సినిమాలోని స్పెషల్ సాంగ్ గురించి కూడా బుచ్చిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ పాట హుక్ లైన్ చాలా పవర్‌ఫుల్‌గా వచ్చింది. తెలుగుతో పాటు హిందీలో కూడా బాగా వర్కౌట్ అవుతుంది. థియేటర్లలో ఈ పాటకు ఫ్యాన్స్ విజిల్స్ వేయడం ఖాయం’ అంటూ ధీమా వ్యక్తం చేశారు. సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ గురించి మాట్లాడుతూ.. ‘రెహమాన్ సార్ ఈ పాటను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లారు. బీట్స్, మ్యూజిక్ అన్నీ మాస్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతాయి’ అన్నారు.
చిన్నప్పటి నుంచి ఏఆర్ రెహమాన్‌తో పని చేయాలని కల ఉండేది. ఒకసారి ఆయన మూడు ట్యూన్స్ వినిపించగా.. నేను నచ్చలేదని చెప్పాను. తర్వాత చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఆయన ‘నువ్వు నా ట్యూన్స్ వెయ్యిసార్లు రిజెక్ట్ చేసినా నేను కొత్తవి ఇస్తాను’ అని చెప్పిన మాట ఎప్పటికీ మర్చిపోలేను అంటూ బుచ్చిబాబు భావోద్వేగంగా మాట్లాడారు. మొత్తానికి, పెద్ది పై బుచ్చిబాబు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.





