కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కీలక ఊరట లభించింది. తన కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు వ్యవహారంలో తన పేరును లాగుతూ జరుగుతున్న ప్రచారంపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
శుక్రవారం బండి సంజయ్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. తన కుమారుడిపై నమోదైన కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అయినప్పటికీ సోషల్ మీడియా, మీడియా వేదికల్లో తన పేరును టార్గెట్ చేస్తూ ప్రచారం జరుగుతోందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.
అలాగే ఇప్పటివరకు తన పేరుతో ప్రచారం చేసిన వీడియోలు, పోస్టులు, డిజిటల్ కంటెంట్‌ను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై స్పందించిన కోర్టు.. బండి సంజయ్‌ను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దుష్ప్రచారాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది.
ఇప్పటివరకు సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, పత్రికలు, వాల్ పోస్టర్ల ద్వారా ప్రచారం చేసిన కంటెంట్‌ను ఈ నెల 26లోపు తొలగించాలని సూచించింది. ఆదేశాలను పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని కోర్టు హెచ్చరించింది.
భవిష్యత్తులో కూడా బండి సంజయ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే.
ఒక మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొత్తానికి, ఈ వ్యవహారంలో కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.





