బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్నప్పటికీ, రాజకీయ వర్గాల్లో మాత్రం వివాదాలకు దారి తీస్తోంది. తాజాగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈ సినిమాపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, అసలు అది ఒక సినిమానా? మూడు గంటల పాటు సోది చూపించారు. నాకు అలాంటి సినిమాలు చూడటానికి టైమ్ లేదు. బూతులు, హింస తప్ప అందులో ఏముంది? ఈ సినిమా చూసిన తర్వాత ముస్లింలపై ప్రజల్లో తప్పుదారి పడే భావనలు కలిగేలా చేస్తోంది’ అంటూ విమర్శించారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మంచి స్పందన వస్తోందని యాంకర్ ప్రశ్నించగా, ఒవైసీ తనదైన హైదరాబాదీ స్టైల్‌లో స్పందించారు. మా హైదరాబాద్‌లో ఒక మాట ఉంది.. ఇలాంటి విషయాలను సీరియస్‌గా తీసుకోకండి, వదిలేయండి. మేమూ అలాగే ఈ సినిమాను పట్టించుకోవడం లేదు అంటూ చురకలు వేశారు.
ఒవైసీ విమర్శలు ఒకవైపు ఉంటే, మరోవైపు ధురంధర్ 2 మాత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
ఒక భారత గూఢచారి పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులను ఎలా ఎదుర్కొన్నాడనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. విమర్శలు వచ్చినా, ప్రేక్షకుల ఆదరణ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.





