మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. తన కుమారుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజును కేవలం ఆర్భాటాలకే పరిమితం చేయకుండా, సమాజానికి ఉపయోగపడే విధంగా జరుపుకోవడం ద్వారా అభిమానుల మనసులను గెలుచుకున్నారు.
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చిరంజీవికి ప్రతిష్టాత్మకమైన ‘ఎన్టీఆర్ జాతీయ పురస్కారం’ అందజేసిన సంగతి తెలిసిందే. ఈ అవార్డు కింద వచ్చిన ₹10 లక్షల నగదును వ్యక్తిగతంగా వినియోగించకుండా, సమాజ సేవ కోసం వినియోగించాలని ఆయన నిర్ణయించుకున్నారు.

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆ మొత్తాన్ని వివిధ రంగాల్లో సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు సమానంగా విరాళంగా ఇచ్చారు. అనాథ వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్న సర్వ్ ఫౌండేషన్, చూపులేని చిన్నారులకు విద్యా-వైద్య సహాయం అందిస్తున్న దేవనార్ ఫౌండేషన్, అనాథ పిల్లల సంరక్షణలో ఉన్న వాల్మీకి నయశ్రీ ఫౌండేషన్ వంటి సంస్థలకు ఆయన ఆర్థిక సహాయం అందించారు. అలాగే క్యాన్సర్ బాధితుల చికిత్స కోసం కూడా విరాళం ఇచ్చారు.

ఇక ఈ కార్యక్రమంలో మరొక హృదయాన్ని హత్తుకునే ఘట్టం చోటుచేసుకుంది. ఇటీవల రామ్ చరణ్ సినిమా షూటింగ్ సమయంలో కొందరు వృద్ధులు ఆయనను కలసి ఆశీర్వదించిన విషయం గుర్తుంచుకున్న చిరంజీవి, వారందరినీ ప్రత్యేకంగా తన బ్లడ్ బ్యాంక్‌కు ఆహ్వానించారు. వారికి కొత్త బట్టలు పంపిణీ చేయడంతో పాటు, వారితో సమయం గడిపి స్వయంగా భోజనం వడ్డించారు.
మెగాస్టార్ వంటి వ్యక్తి తమకు స్వయంగా సేవ చేయడం చూసి ఆ వృద్ధులు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్ #Chiranjeevi గారు హైదరాబాద్ లోని CCT వద్ద మెగా పవర్ స్టార్ #RamCharan పుట్టినరోజును అత్యంత వైభవంగా జరుపుకున్నారు 👌
— H A N U (@HanuNews) March 27, 2026
ఆయన స్వయంగా సేవా సంస్థలకు చెక్కులను అందజేశారు, అన్నదానం చేశారు మరియు వస్త్రాలను పంపిణీ చేశారు @KChiruTweets @AlwaysRamCharan #HbdRamCharan pic.twitter.com/y9ikSCbl4U
చిరంజీవి చేసిన ఈ సేవా కార్యక్రమంపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘మా బాస్ మనసు బంగారం’ అంటూ కామెంట్లు చేస్తూ ఆయన గొప్ప మనసును కొనియాడుతున్నారు.





