రణవీర్ సింగ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ధురంధర్ 2 విడుదలకు సిద్ధమైంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదలకు ముందే ఈరోజు నుంచే పెయిడ్ ప్రివ్యూలు కూడా ప్రారంభమయ్యాయి.
అయితే సినిమా విడుదలకు ముందే సెన్సార్ బోర్డు (CBFC) రిపోర్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు పలు మార్పులు సూచించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హింసాత్మక దృశ్యాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొన్ని సన్నివేశాలను తొలగించాలని లేదా తగ్గించాలని సూచించింది. కళ్లు నలిపే సీన్లు, తల నరికే దృశ్యాలు, సిమెంట్ బ్లాకులు, సుత్తితో దాడి చేసే భాగాలు సహా మొత్తం 21 మార్పులు సూచించినట్లు సమాచారం.
ఇవి మాత్రమే కాకుండా, సబ్‌టైటిల్స్‌లో కొన్ని తేదీలను సరిచేయాలని, కొన్ని ప్రదేశాల ప్రస్తావనల్లో కూడా మార్పులు చేయాలని బోర్డు సూచించిందని తెలుస్తోంది. అలాగే ప్రధానమంత్రి ప్రస్తావనలు, వార్తా ఫుటేజీ వినియోగానికి సంబంధించి మేకర్స్ అధికారిక అనుమతి పత్రాలను సమర్పించినట్లు సమాచారం.
ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది. కట్‌ల తర్వాత భారతీయ వెర్షన్ రన్‌టైమ్ 3 గంటలు 49 నిమిషాలు 36 సెకన్లుగా ఫైనల్ అయింది. విదేశీ వెర్షన్‌తో పోలిస్తే ఇండియన్ వెర్షన్ దాదాపు 6 నిమిషాలు తక్కువగా ఉండనుంది.
సెన్సార్ నిర్ణయంపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. A రేటింగ్ ఇచ్చిన తర్వాత కూడా సీన్లకు కత్తెర వేయడం ఎందుకని కొందరు ప్రశ్నిస్తుండగా, మరికొందరు సెన్సార్ బోర్డు పాత్రపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగిస్తున్నారు.
ఇక ధురంధర్ ఫస్ట్ పార్ట్ 2025 డిసెంబర్‌లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఆ సినిమా రికార్డు స్థాయి వసూళ్లు సాధించడంతో పార్ట్ 2పై అంచనాలు మరింత పెరిగాయి. ట్రైలర్‌లో రణవీర్ సింగ్ జస్కిరాత్, హమ్జా అనే రెండు పవర్‌ఫుల్ పాత్రల్లో కనిపించడం సినిమాపై హైప్‌ను పెంచింది.
అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బలంగానే ఉన్నట్లు సమాచారం. పెయిడ్ ప్రివ్యూల ద్వారానే ఇప్పటికే భారీ వసూళ్లు నమోదు కాగా, తొలి రోజు కోసం వేలాది షోలకు లక్షల్లో టికెట్లు అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.





