స్టార్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా పిల్లలను కనడం, ఆర్థిక స్థోమత వంటి అంశాలపై ఆమె చెప్పిన మాటలు నెటిజన్ల మధ్య వివాదానికి కారణమయ్యాయి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో వరలక్ష్మి మాట్లాడుతూ, ‘మన దేశంలో సెక్స్ గురించి ఎవరూ బహిరంగంగా మాట్లాడరు. కానీ జనాభా విషయంలో మాత్రం మనం నంబర్ వన్‌గా ఉన్నాం. చాలామంది పిల్లలను ప్లానింగ్ లేకుండా కనేస్తారు. తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధపడతారు. పిల్లలను కనేముందు ఒకసారి ఆలోచించాలి కదా’ అని వ్యాఖ్యానించారు.
తాను పిల్లలకు వ్యతిరేకం కాదని కూడా ఆమె స్పష్టం చేశారు. అయితే ప్రస్తుత కాలంలో పిల్లలను పెంచడం చాలా ఖర్చుతో కూడుకున్న విషయమని చెప్పారు. ‘చాలామంది తమ పిల్లల చదువుల కోసం సహాయం కోరుతూ నా దగ్గరకు వస్తుంటారు. అయితే ముందుగా తమ సామర్థ్యాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కనీసం ఒకరిని పోషించే స్థోమత ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని పిల్లలను కనడం మంచిది’ అని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ ఇంటర్వ్యూలో ఆమె పక్కనే ఉన్న నటి ప్రియమణి, మంచు లక్ష్మి కూడా వరలక్ష్మి అభిప్రాయానికి మద్దతుగా స్పందించినట్లు తెలుస్తోంది.
ఇక వరలక్ష్మి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె చెప్పిన విషయాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని భావిస్తుంటే, మరికొందరు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు.
‘డబ్బున్న వాళ్లే పిల్లలను కనాలనడం సరైంది కాదు. జీవితంలో ఎప్పుడు ఆర్థిక పరిస్థితులు ఎలా మారతాయో చెప్పలేం’ అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పేదవారికి పిల్లలను కనకూడదన్న భావన సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇలా వరలక్ష్మి శరత్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.





