HomePolitics Teluguకడియం శ్రీహరి, దానం నాగేందర్‌లకు బిగ్ రిలీఫ్..

కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లకు బిగ్ రిలీఫ్..

తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లపై దాఖలైన అనర్హత పిటిషన్లను ఆయన కొట్టివేశారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలకు భారీ ఊరట లభించింది.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మార్చి 12లోగా అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తి చేసి తుది నిర్ణయం వెల్లడించాలని స్పీకర్‌కు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్, తాజాగా కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లకు కూడా క్లియర్ చేశారు. దీంతో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు ఊరట లభించింది.

తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ బీఆర్ఎస్ నాయకులు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎం. సంజయ్ కుమార్, గూడెం మహిపాల్ రెడ్డి, టి. ప్రకాశ్ గౌడ్, కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ తదితరులపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి.

స్పీకర్ నిర్ణయం ఆలస్యమవుతోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు ముందుగా హైకోర్టును, తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనంతరం సుప్రీంకోర్టు నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేసి తుది నిర్ణయం ప్రకటించాలని స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పుడు స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular