HomeMovie News Telugu‘పెద్ది’ సీక్రెట్ రివీల్ చేసిన బుచ్చిబాబు

‘పెద్ది’ సీక్రెట్ రివీల్ చేసిన బుచ్చిబాబు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన సెకండ్ సింగిల్ ‘రై రై రారా’ సోషల్ మీడియాలో భారీ స్పందన తెచ్చుకుంటోంది.

ఈ పాటపై మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు. “ఈ పాటలో ఉన్న శక్తి, భావోద్వేగం, సినిమాటిక్ గ్రాండియర్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. చరణ్ డ్యాన్స్, అతని ఎనర్జీ చూస్తుంటే తండ్రిగా నాకు ఎంతో గర్వంగా ఉంది” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. అలాగే సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, గేయరచయిత అనంత శ్రీరామ్, నిర్మాత వెంకట సతీష్ కిలారును కూడా ఆయన అభినందించారు.

చిరంజీవి ట్వీట్‌కు స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు సనా ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. “ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది సార్. ఈ పాట షూటింగ్ జరుగుతున్నప్పుడు చరణ్ సార్‌కు తీవ్రమైన జ్వరం ఉంది. మేమంతా షూటింగ్ ఆపేద్దామని చెప్పినా, ఆయన మాత్రం చేయాల్సిందే అని పట్టుబట్టారు. అంత జ్వరంలో కూడా ముఖంపై చిరునవ్వుతో, ఎంతో గ్రేస్‌తో డ్యాన్స్ చేశారు. ఆ క్రమశిక్షణ, అంకితభావం అన్నీ మీ నుంచి వచ్చినవే సార్” అంటూ బుచ్చిబాబు భావోద్వేగంగా తెలిపారు.

జ్వరాన్ని కూడా లెక్కచేయకుండా చరణ్ చూపించిన డెడికేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “అదే మెగా వారసుడి అంకితభావం” అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఈ భారీ చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతి బాబు, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular