HomeTelugu'జయజయహే తెలంగాణ' నుండి 'చూడ చక్కని తల్లి' వరకు.. అందెశ్రీ రాసిన అద్భుతమైన గీతాలు

‘జయజయహే తెలంగాణ’ నుండి ‘చూడ చక్కని తల్లి’ వరకు.. అందెశ్రీ రాసిన అద్భుతమైన గీతాలు

తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రముఖ కవి అందెశ్రీ గుండెపోటుతో మరణించడంతో సాహితీ ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. బడికి వెళ్లకుండానే, చేతిలో బలపం పట్టకుండానే సాహితీ రంగంలో అడుగుపెట్టి అగ్రస్థానాన్ని అందుకున్న కవి అందెశ్రీ, తన రచనలతో తెలంగాణ మనసును కదిలించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.

అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ, సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటుగా మారింది. ఆయన రచనలు ప్రకృతి ప్రేమ, తెలంగాణ జానపద స్ఫూర్తి, సామాజిక అవగాహనలతో నిండినవి.

తెలంగాణ గర్వగీతం ‘జయజయహే తెలంగాణ’

అందెశ్రీ కలం నుండి పుట్టిన ‘జయజయహే తెలంగాణ’ గీతం రాష్ట్ర గీతంగా గుర్తింపుపొందింది. ఈ పాటలో ఆయన తెలంగాణ ఆత్మను పదాల్లో మలచారు. ఈ గీతం రూపంలో ఆయన ఎప్పటికీ తెలంగాణ ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు.

ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగరేసిన పాటలు

తెలంగాణ ఉద్యమం కాలంలో అందెశ్రీ రాసిన పలు పాటలు ప్రజల్లో జోష్ నింపాయి. ‘జై భోలో తెలంగాణ’ సినిమాలోని ‘జన జాతరలో మన గీతం’ పాట ఉద్యమ సమయంలో ప్రజల హృదయాలను తాకింది. అలాగే ‘ఊరు తెలంగాణ’, ‘నా పేరు తెలంగాణ’ పాటలు ఉద్యమ గీతాలుగా మారి ప్రతి తెలంగాణ మనసును ఉవ్వెత్తున ఎగరేశాయి.

ప్రకృతిని ఆరాధించిన కవి

అందెశ్రీ ప్రకృతి సౌందర్యాన్ని అక్షరాల రూపంలో అద్భుతంగా మలిచారు. ఆయన రాసిన ‘పల్లెనీకు వందనాలమ్మా’ పాట గ్రామీణ జీవిత సౌందర్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ పాటను రసమయి బాలకిషన్ స్వరపరిచారు.

అదేవిధంగా, ‘గలగల గజ్జలబండి.. ఘల్లు చూడు’ పాటలో తన స్వగ్రామమైన ఓరుగల్లును గొప్పగా వర్ణిస్తూ, తన మట్టి ప్రేమను చూపించారు.

మనసును కదిలించే అద్భుత గీతాలు

అందెశ్రీ కలం నుండి పుట్టిన ‘కొమ్మ చెక్కితే బొమ్మరా’, ‘ఎల్లిపోతున్నావా తల్లి’, ‘చూడు తెలంగాణ’, ‘అల్లంత దూరం చూడు’, ‘ఆడ బ్రతుకు’ వంటి పాటలు భావోద్వేగంతో నిండినవి. ఇవి ఆయన సాహిత్య గాఢతను, తెలంగాణ పట్ల ఉన్న ప్రేమను ప్రతిబింబిస్తాయి.

అదేవిధంగా ‘ఎర్ర సముద్రం’ సినిమాలోని ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు’ పాట మానవత్వం గురించి చెప్పిన అద్భుత గీతంగా నిలిచింది. ఈ పాటలు అందెశ్రీని సాహిత్య చరిత్రలో చిరస్మరణీయుడిగా నిలబెట్టాయి.

అందెశ్రీ రాసిన ప్రతి పాట తెలంగాణ మనసును తాకుతూ, స్ఫూర్తినిస్తూ, కాలాతీతమైన కవిత్వంగా నిలిచిపోయింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular