జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills By-Election) రాజకీయంగా వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఉపఎన్నిక హిందూ-ముస్లింల మధ్య జరిగే పోటీగా ఉందని ఆయన ప్రకటించారు.
“బొట్టు పెట్టుకున్నవాళ్లు, పెట్టుకోనివాళ్లు.. మొలతాడు ఉన్నవాళ్లు, లేనివాళ్ల మధ్యే ఈ పోటీ జరుగుతోంది. ఈ ఎన్నికలో 80% హిందువులు గెలుస్తారా, లేక 20% ముస్లింలు గెలుస్తారా?” అని బండి సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ హిందువుల పక్షాన ఉందని, కాంగ్రెస్ మాత్రం ముస్లింల పక్షాన నిలుస్తుందని ఆయన ఆరోపించారు.
అంతేకాకుండా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను ఇస్లామిక్ స్టేట్‌గా మార్చే కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపాయి.
ముస్లిం టోపీ ధరించడం పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన చర్యపై కూడా బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. “ఓట్ల కోసం నేను ఎప్పుడైనా ముస్లిం టోపీ పెట్టుకోవాల్సి వస్తే, తలనే నరుక్కుంటా” అని ఆయన స్పష్టం చేశారు. తాను హిందువని, ఇతర మతాలను అవమానించేలా ప్రవర్తించనని సంజయ్ చెప్పారు.
రోడ్డు విస్తరణ పేరుతో గోదావరిఖనిలో 46 దారి మైసమ్మ ఆలయాలను కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రోడ్డుకు అడ్డుగా ఉన్నాయనే కారణంతో ఆలయాలను కూల్చివేసిన అధికారులు మసీదులను ఎందుకు కూల్చలేదు? ఇదే అంశంపై పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ… pic.twitter.com/sou6iWnjfG
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 8, 2025
గోదావరిఖనిలో రోడ్డు విస్తరణలో భాగంగా 46 హిందూ ఆలయాలు కూల్చివేయడంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “హిందూ ఆలయాలను ఎలా కూల్చారో, అలాగే రోడ్డు అడ్డంగా ఉన్న మసీదులను కూడా కూల్చాలి. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవు,” అని ఆయన హెచ్చరించారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ముగిసిన వెంటనే గోదావరిఖనికి స్వయంగా వస్తానని, అధికారుల చర్యలను ప్రశ్నిస్తానని సంజయ్ తెలిపారు. ఆలయాల పునర్నిర్మాణం జరగకపోతే, రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులను కూల్చే ఉద్యమం తానే చేపడతానని ఆయన ప్రకటించారు.
బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చాయి. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలు, సామాజిక సంస్థలు తీవ్రంగా స్పందిస్తూ, ఎన్నికల్లో మత వివాదాలను రెచ్చగొట్టడం అసహ్యకరమని విమర్శిస్తున్నారు.





