HomeMovie News Teluguబాడీ షేమింగ్ వివాదం.. గౌరీ కిషన్‌కు క్షమాపణ చెప్పిన యూట్యూబర్ కార్తీక్!

బాడీ షేమింగ్ వివాదం.. గౌరీ కిషన్‌కు క్షమాపణ చెప్పిన యూట్యూబర్ కార్తీక్!

తమిళ నటి గౌరీ కిషన్‌ను (Gouri Kishan) ఆమె శరీర ఆకారం, బరువు గురించి అభ్యంతరకరమైన ప్రశ్న అడిగి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న యూట్యూబర్–జర్నలిస్ట్ ఆర్.ఎస్. కార్తీక్ (R.S. Karthik) చివరికి క్షమాపణలు చెప్పారు.

కార్తీక్ తన వివరణలో, “నా ప్రశ్న ఉద్దేశం వేరేగా ఉంది. అది కేవలం సరదాగా అడిగిందే కానీ, బాడీ షేమింగ్ చేయాలనే ఉద్దేశం కాదు. నా మాటలు ఎవరినైనా బాధపెట్టినట్లయితే హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నాను” అని పేర్కొన్నారు.

అయితే తన ప్రశ్నలో తప్పేమీ లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. “సినిమాలో హీరో ఆమెను ఎత్తే సన్నివేశం గురించి సరదాగా మాట్లాడాను. కానీ గౌరీ కిషన్ దాన్ని వేరే రీతిలో అర్థం చేసుకున్నారు. ఎవరినీ ఉద్దేశపూర్వకంగా బాధపెట్టే ఆలోచన నాకు లేదు” అని ఆయన చెప్పారు.

కార్తీక్ ప్రశ్న తమిళనాట పెద్ద వివాదంగా మారింది. సోషల్ మీడియాలో ఆయనపై విమర్శల వర్షం కురిసింది. పలువురు సినీ ప్రముఖులు గౌరీ కిషన్‌కు మద్దతుగా నిలుస్తూ, మహిళా నటీమణుల పట్ల గౌరవం తప్పనిసరి అని పిలుపునిచ్చారు.

దక్షిణాది నటీనటుల సంఘం (SIAA) అధ్యక్షుడు నాజర్ ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. “జర్నలిజం ముసుగులో ఇటువంటి అనైతిక ప్రవర్తన అనుమతించలేము. మీడియా ప్రతినిధులు వృత్తి ప్రమాణాలను కచ్చితంగా పాటించాలి” అని హెచ్చరించారు.

ఈ ఘటన అబిన్ హరిహరన్ దర్శకత్వంలో రూపొందిన ‘అదర్స్’ (Others) సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో చోటుచేసుకుంది. నవంబర్‌ 7న విడుదలైన ఈ చిత్రంలో ఆదిత్య మాధవన్‌, గౌరీ కిషన్‌ హీరో-హీరోయిన్లుగా నటించారు.

తనపై విమర్శలు చేసిన యూట్యూబర్‌ కార్తీక్‌ను అభిమానులు వ్యక్తిగతంగా టార్గెట్‌ చేయవద్దని గౌరీ కిషన్‌ విజ్ఞప్తి చేశారు. “నేను మాట్లాడింది కేవలం నా కోసం కాదు. బాడీ షేమింగ్‌, లింగ వివక్షను ఆపాలన్న ఉద్దేశ్యంతోనే ఈ విషయం బహిరంగంగా చెప్పాను. ఎవరినీ అవమానించాలనే ఉద్దేశం లేదు” అని గౌరీ స్పష్టం చేశారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular