HomeSports Teluguవిశ్వవిజేతలను కలిసిన ప్రధాని మోదీ.. మహిళల క్రికెట్ జట్టుకు కితాబు!

విశ్వవిజేతలను కలిసిన ప్రధాని మోదీ.. మహిళల క్రికెట్ జట్టుకు కితాబు!

47 ఏళ్ల నిరీక్షణకు తెరదిస్తూ భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారిగా ఐసీసీ వరల్డ్ కప్ టైటిల్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చారిత్రాత్మక విజయానంతరం జట్టును ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సన్మానించారు.

భారత ప్లేయర్లు మంగళవారం ముంబై నుంచి ఢిల్లీకి చేరుకొని, బుధవారం సాయంత్రం లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ, ప్లేయర్లతో స్నేహపూర్వకంగా ముచ్చటించారు. జట్టు సాధించిన అపూర్వ విజయాన్ని ప్రశంసిస్తూ, వారి ధైర్యం, పట్టుదల నిజంగా దేశానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.

వరల్డ్ కప్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి తర్వాత కూడా వెనక్కి తగ్గకుండా పోరాడిన జట్టు ధైర్యాన్ని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. సోషల్ మీడియా ట్రోలింగ్‌ను ఎదుర్కొని, ఒత్తిడిని ప్రేరణగా మార్చుకున్న ఈ జట్టు నిజమైన “కృషి ఫలితమే ఈ విజయం” అని అన్నారు.

ప్లేయర్లు కూడా తమ ప్రయాణంలో ఎల్లప్పుడూ ప్రోత్సాహంగా నిలిచినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వరల్డ్ కప్ ట్రోఫీని ప్రధానికి చూపించారు. అలాగే, సంతకాలతో కూడిన జెర్సీని బహుమతిగా అందించారు.

సంభాషణలో ఆసక్తికర విషయాలు చోటుచేసుకున్నాయి. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ 2017 వరల్డ్ కప్ అనంతరం ప్రధాని మోదీని కలిసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. “అప్పుడు ట్రోఫీ లేకుండా కలిశాం, ఇప్పుడు ట్రోఫీతో కలుస్తున్నాం” అని హర్మన్ కౌర్ చిరునవ్వుతో చెప్పింది.

స్మృతి మంధాన మాట్లాడుతూ, “ప్రధాని గారు ఎల్లప్పుడూ మాకు స్ఫూర్తినిస్తారు. మహిళల సాధికారతకు ఆయన తీసుకుంటున్న చర్యలు మాకు గర్వకారణం” అని తెలిపింది.

దీప్తి శర్మతో మాట్లాడినప్పుడు మోదీ, ఆమె చేతిపై ఉన్న హనుమంతుడి టాటూ, ఇన్‌స్టాగ్రామ్ బయోలో ఉన్న ‘జై శ్రీరామ్’ గురించి ప్రస్తావించారు. దీప్తి సమాధానమిస్తూ – “నా విశ్వాసం నాకు బలం, సానుకూలతను ఇస్తుంది” అని చెప్పింది.

అదే సమయంలో సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్, అమన్‌జోత్ కౌర్ అందుకున్న కీలక క్యాచ్‌లను ప్రధాని ప్రత్యేకంగా గుర్తు చేశారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular