టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరోసారి చరిత్ర సృష్టించాడు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ (ODI Rankings)లో రోహిత్ రెండు స్థానాలు ఎగబాకి 781 పాయింట్లతో మొదటిసారిగా అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
38 ఏళ్ల 182 రోజుల వయసులో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచిన అత్యంత వయస్కుడైన ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు అగ్రస్థానంలో ఉన్న భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill)ను వెనక్కి నెట్టి ఈ అరుదైన మైలురాయిని సాధించాడు.

ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ అద్భుత ఫారమ్‌లో ఉన్నాడు. అడిలైడ్ (Adelaide) వేదికగా రెండో వన్డేలో 97 బంతుల్లో 73 పరుగులు చేసిన ఆయన, సిడ్నీ (Sydney)లో జరిగిన మూడో వన్డేలో 125 బంతుల్లో అజేయంగా 121 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ స్థానాన్ని అందుకున్న భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఐదో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాల సరసన రోహిత్ కూడా చేరాడు.





