సినీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ చెప్పారు. సినీ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక వెల్ఫేర్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ నిధికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
అంతేకాదు, సినిమా నుంచి వచ్చే ఆదాయంలో 20 శాతం వాటా సినీ కార్మికుల వెల్ఫేర్ ఫండ్‌కు ఇవ్వాలని ఇండస్ట్రీకి సీఎం సూచించారు. భవిష్యత్తులో సినిమా టికెట్ ధరలు పెంచాలంటే, అందులో 20 శాతం వాటా ఈ వెల్ఫేర్ ఫండ్‌కి కేటాయిస్తేనే పర్మిషన్ ఇస్తామని స్పష్టం చేశారు.
సినీ కార్మికుల కుటుంబాల భవిష్యత్తు దృష్ట్యా సీఎం రేవంత్ పలు కీలక హామీలు ఇచ్చారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు కార్పొరేట్ స్థాయిలో స్కూల్‌ను నిర్మించి సినీ కార్మికుల పిల్లలకు ఉచిత విద్యా సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. అలాగే ఆరోగ్య శ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు వెల్లడించారు. ఫ్యూచర్ సిటీలో సినీ ఫైటర్ల ట్రైనింగ్ సెంటర్ కోసం స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
సినీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో సీఎం రేవంత్ ఈ విషయాలు వెల్లడించారు. తెలుగు సినీ పరిశ్రమను హైదరాబాద్‌కు తీసుకురావడంలో మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి చేసిన కృషిని ఆయన గుర్తుచేశారు.
అలాగే డా. ప్రభాకర్ రెడ్డి మణికొండలో సినీ కార్మికుల కోసం 10 ఎకరాల స్థలం ఇచ్చారని, చిత్రపురి కాలనీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని తెలిపారు. సినీ కార్మికులు కష్టపడే వర్గమని గుర్తించి, దిల్ రాజుకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించామని చెప్పారు.
కొన్ని సంవత్సరాలుగా నిలిపివేసిన నంది అవార్డుల స్థానంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ అవార్డులు అందజేస్తామని తెలిపారు. అలాగే తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికలో ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రత్యేక చాప్టర్ ఉంటుందని స్పష్టం చేశారు. నవంబర్ చివరి వారంలో సినీ కార్మికుల సమస్యలపై మళ్లీ సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.





