తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ప్రజలకు, పోలీసులకు మద్దతుగా నిలిచారు. విధి నిర్వహణలో వీరమరణం పొందిన నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన ప్రకటించారు. ప్రమోద్ కుటుంబానికి రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా, ఇంటి స్థలం మంజూరు చేయడంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్లు సీఎం తెలిపారు. అదనంగా పోలీస్ భద్రతా సంక్షేమ నిధి నుంచి రూ.16 లక్షలు, పోలీస్ వెల్ఫేర్ ఫండ్ నుండి రూ.8 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగిన “పోలీస్ అమరవీరుల సంస్మరణ” కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్, విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ‘అమరులు వారు’ పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని డీజీపీ శివధర్‌కు అందజేశారు.
*కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ. కోటి నష్ట పరిహారం: సీఎం రేవంత్ రెడ్డి..*
— NageshT (@NageshT93116498) October 21, 2025
పోలీస్ వెల్ఫేర్ నుంచి రూ. 8 లక్షలు, పోలీస్ భద్రతా సంక్షేమం నుంచి రూ. 16 లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తాము..
ప్రమోద్ కుటుంబానికి 300 గజాల ఇంటి స్థలం రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది..
కుటుంబ సభ్యుల్లో… pic.twitter.com/Zjjr4qqfoT
సీఎం రేవంత్ మాట్లాడుతూ – దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీస్ శాఖ ప్రథమ స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో అసాంఘిక కార్యకలాపాలు పెరగకుండా పోలీసులు సమర్థవంతంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. “తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలన్నదే మా లక్ష్యం. ఇందుకోసం ఈగల్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి పూర్తి అధికారాలు ఇచ్చాం” అన్నారు.
కొత్త తరహా నేరాలు సవాల్‌గా మారుతున్నాయని, పోలీసులు వాటిని సమర్థంగా ఎదుర్కొంటున్నారని సీఎం తెలిపారు. చివరగా మావోయిస్టు నేతలకు పిలుపునిస్తూ – “జనజీవన స్రవంతిలో కలిసిపోండి, హింసా మార్గాన్ని వదిలి సమాజ నిర్మాణంలో భాగస్వాములు అవ్వండి” అని విజ్ఞప్తి చేశారు.





