హైదరాబాద్ నగరంలో మరోసారి షాకింగ్ ఘటన వెలుగుచూసింది. మధురానగర్‌లోని జవహర్ నగర్ ప్రాంతంలో ఓ ఇంటి యజమాని తన అద్దెదారుల బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేసిన ఘటన పెద్ద కలకలం రేపింది.
పోలీసుల సమాచారం ప్రకారం, అశోక్ యాదవ్ అనే ఇంటి యజమాని తన అద్దెదారులపై నిఘా పెట్టేందుకు ఎలక్ట్రీషియన్ చింటుతో కలిసి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరాను అమర్చించాడు. 23 ఏళ్ల ప్రైవేట్ ఉద్యోగి మహిళ తన భర్తతో కలిసి ఆ ఇంటిలో నివాసం ఉంటోంది. ఈ నెల 4వ తేదీన బాత్రూమ్‌లోని బల్బ్ పనిచేయకపోవడంతో ఓనర్‌ను సంప్రదించగా, ఎలక్ట్రీషియన్‌ను పిలిపించి కొత్త బల్బ్ అమర్చమని చెప్పాడు. అయితే, అదే సమయంలో హోల్డర్‌లో సీక్రెట్ కెమెరా కూడా పెట్టించాడు.
కొద్ది రోజుల తర్వాత బాత్రూమ్ హోల్డర్‌లోని స్క్రూ కిందపడిపోవడంతో అనుమానం వచ్చిన మహిళ తన భర్తను పరిశీలించమని చెప్పింది. పరిశీలించిన భర్త కెమెరా ఉన్నట్లు గుర్తించి, వెంటనే ఇంటి యజమానిని ప్రశ్నించాడు. కానీ అతడు పట్టించుకోకపోవడంతో జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీనిపై స్పందించిన పోలీసులు అశోక్ యాదవ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అతడే సీక్రెట్ కెమెరా అమర్చమని చెప్పినట్లు తేలడంతో అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు ఎలక్ట్రీషియన్ చింటు పరారీలో ఉండగా, పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకుముందు హోటళ్లు, హాస్టళ్లలో మాత్రమే ఇలాంటి సంఘటనలు నమోదయ్యే వేళ, ఇప్పుడు అద్దె ఇళ్లలో కూడా ఇలాంటి ఘటనలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. కాబట్టి అద్దెకు వెళ్లే ముందు వాష్‌రూమ్, బెడ్రూమ్‌లలో లైట్లు, హోల్డర్లు, ఫ్యాన్‌లను చెక్ చేయడం తప్పనిసరిగా మారిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.





