భారతదేశానికి గర్వకారణంగా, షెర్రీ సింగ్ (Sherry Singh) మిసెస్ యూనివర్స్ టైటిల్ను గెలుచుకున్నారు. 48 సంవత్సరాల చరిత్రలో ఈ కిరీటం అందుకున్న తొలి భారతీయ మహిళగా షెర్రీ సింగ్ చరిత్ర సృష్టించారు. ఈ ఘనతను ఆమె ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన 48వ ఎడిషన్ మిసెస్ యూనివర్స్ 2025 పోటీల్లో సాధించారు.
ఇప్పటి వరకు భారతదేశం మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ కిరీటాలను అనేకసార్లు గెలుచుకుంది. కానీ, వివాహిత మహిళల కోసం నిర్వహించే మిసెస్ యూనివర్స్ పోటీలలో ఇప్పటివరకు ఏ భారతీయురాలికీ ఈ కిరీటం లభించలేదు. ఈసారి మొత్తం 120 దేశాల నుంచి వచ్చిన పోటీదారుల్లో షెర్రీ సింగ్ అగ్రస్థానంలో నిలిచారు.
పోటీ విజేతగా పేరు ప్రకటించిన క్షణంలో షెర్రీ సింగ్ భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లతో కిరీటం స్వీకరించిన ఆమె, “ఈ విజయం నా ఒక్కదానిది కాదు, ప్రతి భారత మహిళది. కష్టాలు దాటుకుని కలలు కనడానికి ధైర్యం చేసే ప్రతి మహిళకు ఈ విజయం అంకితం” అని అన్నారు.
India's Sherry Singh won the title of Mrs. Universe 2025 👸✨️ pic.twitter.com/qHlcXFNzR6
— ई (@Indiamymuse) October 11, 2025
తొమ్మిదేళ్ల క్రితం వివాహం అయిన షెర్రీకి ఒక కుమారుడు ఉన్నాడు. ఆమె ఫ్యాషన్ టెక్నాలజీలో మాస్టర్స్ పూర్తి చేశారు. అంతేకాదు, జాతీయ స్థాయి బాస్కెట్బాల్ క్రీడాకారిణి కూడా. సామాజిక సేవలోనూ ఆమెకు మంచి గుర్తింపు ఉంది – ముఖ్యంగా పేద బాలికల విద్య, మానసిక ఆరోగ్యం, భావోద్వేగ శ్రేయస్సు కోసం ఆమె ఎన్నేళ్లుగా కృషి చేస్తున్నారు.
మిసెస్ యూనివర్స్ పోటీల్లో విజేతను కేవలం అందం ఆధారంగా కాకుండా, తెలివితేటలు, కరుణ, సామాజిక బాధ్యతల ఆధారంగా కూడా ఎంపిక చేస్తారని నిర్వాహకులు తెలిపారు. ఈ అన్ని అంశాల్లో షెర్రీ అత్యుత్తమంగా నిలిచారని జ్యూరీ ప్రశంసించింది.
షెర్రీ సింగ్ మెంటర్ మరియు నేషనల్ డైరెక్టర్ ఊర్మిమాలా బోరువా మాట్లాడుతూ – “షెర్రీ సామర్థ్యం పట్ల ఎల్లప్పుడూ విశ్వాసం ఉంచాం. ఆమె సాధించిన ఈ చారిత్రక విజయం భారత్కు గర్వకారణం. దేశానికి గౌరవంగా, ఆత్మవిశ్వాసంతో ప్రాతినిధ్యం వహించాలనుకునే ప్రతి మహిళకు ఆమె ఒక ఆదర్శం” అని పేర్కొన్నారు.
ఇన్స్టాగ్రామ్లో కూడా షెర్రీ సింగ్ చాలా యాక్టివ్. ఫ్యాషన్, ఫిట్నెస్, ఆధ్యాత్మిక జీవితం వంటి విషయాలపై వీడియోలు పంచుకుంటూ, శ్రీకృష్ణుడిపై తన భక్తిని తరచూ వ్యక్తం చేస్తుంటారు.





