ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తనపై నిరాధార ఆరోపణలు, అవమానకరమైన పోస్టులు, మార్ఫ్ చేసిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ తన వ్యక్తిగత ప్రతిష్ఠతో పాటు ప్రభుత్వ ప్రతినిధిగా నిర్వహిస్తున్న బాధ్యతలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని పవన్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు.
పవన్ కళ్యాణ్ అనుమతి లేకుండా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్ములు, కొన్ని ఈ-కామర్స్ సైట్లు, ఇతర ఆన్‌లైన్ ఛానల్స్ ఆయన పేరు, ఫోటోలను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నాయని, అలాగే దుష్ప్రచారం చేస్తూ వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘిస్తున్నాయని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు, ఆయన వ్యక్తిగత హక్కులను రక్షించడం అత్యంత అవసరమని పేర్కొంటూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
పవన్‌పై ప్రచారం అవుతున్న అన్ని తప్పుదారి పట్టించే లింకులు, పోస్టులు, వీడియోలను సోషల్ మీడియా సంస్థలు ఒక వారం లోపు తొలగించాలి. తొలగించాల్సిన URLలు, వీడియోలు, పోస్టుల జాబితాను పవన్ తరఫున 48 గంటల్లో సమర్పించాలి. కేసులో తదుపరి విచారణను డిసెంబర్ 22కి వాయిదా వేస్తూ కోర్టు స్పష్టం చేసింది.
ఇదే తరహా సమస్యతో ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా హైకోర్టులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే జాబితాలో చేరారు. సోషల్ మీడియా నియంత్రణ, బాధ్యతపరచడం దిశగా ఇది మరో కీలక అడుగు అని నిపుణులు భావిస్తున్నారు.
ఇప్పుడు అందరి దృష్టి డిసెంబర్ 22న జరిగే తదుపరి విచారణపైనే. పవన్ కళ్యాణ్ పిటిషన్‌పై కోర్టు ఇంకా ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేస్తుందో చూడాలి.





