HomeTeluguఫ్యూచర్ సిటీకి అన్నపూర్ణ స్టూడియోస్..

ఫ్యూచర్ సిటీకి అన్నపూర్ణ స్టూడియోస్..

తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ ఘనంగా ప్రారంభమైంది. ఈ సమ్మిట్‌కు ముఖ్య అతిథిగా టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన విజన్ డాక్యుమెంట్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు.

ఈ సదస్సులోనే నాగార్జున ఒక కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’కి అన్నపూర్ణ స్టూడియోస్‌ను కూడా తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ఒక ప్రత్యేకమైన ఫిలిం హబ్‌ను ఏర్పాటు చేసే దిశగా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సినిమా పరిశ్రమకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రణాళికలో సినిమా పరిశ్రమ అభివృద్ధికీ స్పష్టమైన ప్రాధాన్యం ఇవ్వడం ఆనందకరమని నాగార్జున తెలిపారు. రాబోయే రోజుల్లో ఫ్యూచర్ సిటీ సినిమా షూటింగ్‌లు, భారీ నిర్మాణాలకు ఒక ప్రధాన కేంద్రంగా మారే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటనతో టాలీవుడ్ వర్గాల్లో భారీ ఉత్కంఠ నెలకొంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular