శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ విషాద ఘటనలో మొత్తం 9 మంది భక్తులు మృతిచెందగా, మరో 13 మంది గాయపడినట్లు అధికారిక వివరాల్లో పేర్కొంది.
కార్తీకమాసం, శనివారం, ఏకాదశి ఒకే రోజు కావడంతో భక్తుల రద్దీ అధికమైందని ప్రభుత్వం తెలిపింది. ఆలయంలో దర్శనాలు ప్రారంభమైన కొద్ది సేపటికే దాదాపు 15 వేలమంది భక్తులు ఒక్కసారిగా ప్రవేశించడంతో రెయిలింగ్ విరిగి, భక్తులు ఒకరిపై ఒకరు పడిపోవడంతో తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుందని వివరించింది.
అక్కడికక్కడే ఏడుగురు భక్తులు మృతిచెందగా, పలాస ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించినట్లు ప్రభుత్వం నిర్ధారించింది. సాయంత్రం వరకు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి, బంధువులకు అప్పగించారని తెలిపింది. అనంతరం అంబులెన్సుల ద్వారా వారి స్వగ్రామాలకు తరలించగా, అక్కడ విషాద వాతావరణం నెలకొంది.
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున సహాయం పీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందజేస్తామని ప్రధాని కార్యాలయం ప్రకటించింది.





