కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధ ఘటనలో కీలక మలుపు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో బస్సు మరియు బైక్ ప్రమాదాలు వేర్వేరు సమయాల్లో జరిగాయని పోలీసులు తేల్చారు.
పోలీసుల ప్రకారం.. బైక్ రైడర్ శివశంకర్ మొదట రోడ్డుపై ప్రమాదానికి గురయ్యారు. ఆ సమయంలో ఆయనతో పాటు ఎర్రిస్వామి అనే వ్యక్తి ఉన్నాడు. ప్రమాదం తర్వాత శివశంకర్ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం రోడ్డుపై పడిపోయిన బైక్‌ను పక్కకు తీసేందుకు ఎర్రిస్వామి ప్రయత్నిస్తుండగా, చీకట్లో వేగంగా వస్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు ఆ బైక్‌ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది.
దీంతో బైక్ పెట్రోల్ ట్యాంకు పగిలి మంటలు చెలరేగి, బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుంది. ఈ విషయాలను ఎర్రిస్వామి తన స్టేట్‌మెంట్‌లో పోలీసులకు వెల్లడించారు. ఆయన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు దర్యాప్తును మరింత విస్తరించారు.
ఇక ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనమై మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు, గాయపడిన వారిలో ఎక్కువ మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా మృతదేహాలను బంధువులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రమాదం రెండు రాష్ట్రాల్లోనూ తీవ్ర విషాదాన్ని నింపింది.





