తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి మంత్రి కొండా సురేఖ (Konda Surekha) క్షమాపణలు తెలిపారు. గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ ఆమె పేర్కొన్నారు “మా ఇంటికి పోలీసులు రావడంతో మా కూతురు సుష్మిత ఆవేశంతో మాట్లాడింది. ఆమె తరపున నేను క్షమాపణలు కోరుతున్నాను. ప్రస్తుతం మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. త్వరలోనే అన్నీ సర్దుమణుగుతాయని నమ్ముతున్నాను” అని తెలిపారు.
కొన్ని రోజుల క్రితం మంత్రి కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్లడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆమె వద్ద ఓఎస్‌డీగా పనిచేసిన సుమంత్‌ను అరెస్టు చేసేందుకు వెళ్లినప్పుడు, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రావడంపై సురేఖ కూతురు సుస్మిత పోలీసులను అడ్డుకున్నారు. ఆ సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వెంకట నరేందర్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సుస్మిత పేర్కొన్నట్లుగా “రోహిన్ రెడ్డి మా ఇంటికి గన్‌తో వచ్చారు. ఆ గన్‌ను సీఎం రేవంత్ ఇచ్చారు. బీసీ మంత్రిగా ఉన్న మా అమ్మను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారు” అని ఆరోపించారు. అయితే తాము ఎవ్వరినీ బెదిరించలేదని సుస్మిత స్పష్టం చేశారు.
ఈ ఘటన తరువాత, మంత్రి కొండా సురేఖ దీపావళి రోజున సీఎం రేవంత్ రెడ్డిని కలసి మొత్తం విషయంపై వివరణ ఇచ్చారు. అయినప్పటికీ వివాదం సర్దుమణగకపోవడంతో, చివరికి ఆమె స్వయంగా క్షమాపణలు తెలిపారు.





